Friday 13 December 2013

మైసూర్ రాజవంశానికి శాపమా! 

మైసూర్ రాజవంశానికి ఉసురు తగిలిందా? ఎన్నో ఏళ్ల క్రితం నాటి శాపం, ఇంకా వెంటాడుతోందా?... మైసూర్ సంస్థానం చివరి రాజైన నరసింహరాజ వడయార్ అకాల మరణంతో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అయితే, ఇవన్నీ మూడ నమ్మకాలే అని కొంతమంది కొట్టి పారేస్తుండగా, మరికొందరు మాత్రం ఇందులో నిజం లేకపోలేదని చరిత్రను తిరగేస్తున్నారు. మరోవైపు  వడయార్ అకాల మరణంతో ఆ సంస్థానంలో కొనసాగే రాజు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

అసలు మైసూర్‌లో జరుగుతున్నదేమిటి? ఎందుకిలా జరుగుతోంది అంటూ ఆరాలు తీస్తున్నారు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే ... సరిగ్గా 400 ఏళ్ల క్రితం, మైసూర్ రాజులకు ఒక శాపం తగిలింది, ఆ శాపం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరు నమ్మినా, నమ్మకున్నా .. ఇదే నిజమంటున్నారు చరిత్రకారులు, స్థానికులు. అసలు జరిగిందేమిటంటే ...

1612లో విజయనగర సామ్రాజ్యాన్ని కూలదోసి, తిరుమలరాజా కిరీటాన్ని చేజిక్కించుకుని, మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు రాజా వొడయార్‌. ఈ విషయం తెలుసుకుని కలత చెందిన తిరుమలరాజా సతీమణి అలమేలమ్మ  వెంటనే రాజ ఆభరణాలు తీసుకుని, సురక్షిత ప్రాంతానికి తరలిపోయింది. దాంతో రాజా వొడయార్ సేనలు నగల కోసం గాలిస్తూ ఆమెను పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఇకపై వొడయార్లకు సంతాన భాగ్యం ఉండదని శపిస్తూ కావేరీ నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంది. దీంతో భయపడిపోయిన వొడయార్లు మైసూర్ ప్యాలెస్‌లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమెకు పూజలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె ఉసురు మాత్రం రాజకుటుంబానికి తగిలిందనే ప్రచారం ఉంది.

అలాగే ఈ శాపాల వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కావేరి ఒడ్డునున్న తలకాడ ప్రాంతంలో ఉన్న ఓ అమ్మవారి దేవాలయాన్ని మైసూరు రాజులు తమకు వరం ఇవ్వలేదని అక్కసుతో ఇసుకతో కప్పివేశారట. దానివల్లే రాజుగా ఉన్న వ్యక్తికి సంతానం కలగడం లేదని చెబుతారు. ఇది 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనగా చెప్పుకుంటారు.

ఇక యాదృచ్చికమో లేక శాప ఫలితమో గానీ మైసూర్‌ను పాలించిన ఏ రాజుకు కూడా వారసులే లేరు. రాజుగా పీఠాన్ని అధిష్టించిన వారికి మగ సంతానం లేకపోవడంతో వాళ్ల తోబుట్టువుల సంతానానికి పట్టం కట్టడం మొదలైంది. వొడయార్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే, 17వ శతాబ్ధం నుంచి ఇప్పటివరకూ ఉన్న ఆరుగురు రాజుల్లో ఎవ్వరికీ సంతానం కలగలేదు. దాంతో వారంతా తమ మేనల్లుళ్లని వారసులుగా ప్రకటించారు.

అంతెందుకు వొడయార్ రాజుల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నల్వాది కృష్ణరాజ వొడయార్‌కు సంతానం లేకపోవడంతో, ఆయన మేనల్లుడు జయచామరాజాను వారసుడిగా ప్రకటించారు. ఈ జయచామరాజా తనయుడే గుండెపోటుతో కన్నుమూసిన శ్రీకంఠదత్తా. ఇప్పుడు శ్రీకంఠదత్తాకు సంతానం లేదు. దీంతో ఆయన సోదరి రాణి గాయత్రీ దేవి కొడుకైన కాంతరాజే శ్రీకంఠకు తుది సంస్కారాలు నిర్వహించారు.

నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉండగా వారిలో రెండో సోదరి గాయవూతిదేవి కుమారుల్లో పెద్దవాడైన చదురంగా కాంతరాజును తదుపరి రాజుగా ప్రకటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.  ఈ నేపథ్యంలో ఇదంతా శాపం వల్లే జరుగుతోందని కొందరి అభిప్రాయం. అయితే, దీని వెనక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుందని, పాపపుణ్యాలు, శాపలన్నీ మూఢనమ్మకాలని మరికొందరి వాదన. ఏది ఏమైనా ... మైసూర్‌లో మొత్తానికి ఏదో మిస్టరీ దాగుంది.
Posted by Unknown On 12/13/2013 No comments

0 comments:

Post a Comment

  • RSS
  • Delicious
  • Digg
  • Facebook
  • Twitter
  • Linkedin
  • Youtube

Translate

Total Pageviews